కలం, స్పోర్ట్స్: కుమమోటో మాస్టర్స్ జపాన్ సూపర్ 500 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ (Lakshya Sen) గెలిచి సెమీస్ చేరగా, కిదాంబి శ్రీకాంత్ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 40 నిమిషాల్లోనే జపాన్ ఆటగాడు యుషి తనకాను 21-16, 21-15తో చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో 5-5 తర్వాత వేగం పెంచిన లక్ష్య, కచ్చితమైన షాట్లతో గేమ్ గెలిచాడు. రెండో గేమ్‌లోనూ 9-9 వద్ద స్కోరు సమం అయ్యాక, తన మార్క్ జంప్ స్మాష్‌లతో చెలరేగి మ్యాచ్ ముగించాడు. వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న లక్ష్య, సీజన్ ఎండింగ్ టోర్నీకి అర్హత సాధించాలంటే టాప్-8లో నిలవాలి. సెమీస్‌లో అతడు ఇండోనేషియా ఆటగాడు అల్వీ ఫర్హాన్‌తో తలపడనున్నాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పోరాడి ఓడాడు. జపాన్‌కు చెందిన 15వ ర్యాంకర్ కోకి వటనాబే చేతిలో 22-24, 15-21తో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్‌లో వచ్చిన గేమ్ పాయింట్‌ను శ్రీకాంత్ చేజార్చుకున్నాడు. రెండో గేమ్‌లో 12-5తో భారీ ఆధిక్యంలో నిలిచిన శ్రీకాంత్, ఆ తర్వాత అనూహ్యంగా తడబడ్డాడు. వరుస తప్పిదాలతో పాయింట్లు కోల్పోయాడు. ఇదే అదనుగా వటనాబే చివరి 19 పాయింట్లలో 16 పాయింట్లు గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నాడు. సెమీఫైనల్లో లక్ష్య సేన్ ఇదే జోరును కొనసాగించి ఫైనల్ చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.

