కలం, నల్గొండ: మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా రైతులకు తీరని ద్రోహం చేస్తోందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యదర్శి విజూ కృష్ణన్ (Vijoo Krishnan) అన్నారు. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా శుక్రవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండలో జరిగే మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా 1.58 కోట్ల మంది సభ్యులకు ఈ ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నవంబర్ 16న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు రాకేష్ తికాయత్, రావుల వెంకయ్య, పురుషోత్తం శర్మ, శంకర్ ఘోష్ తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందన్నారు.
సాయుధ రైతాంగ పోరాటం గొప్ప స్ఫూర్తి..
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశానికే కాకుండా ప్రపంచ రైతాంగ ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని విజూ కృష్ణన్ అన్నారు. పది లక్షల మందికి పైగా భూమిలేని పేదలకు భూమిపై హక్కులు కల్పించేందుకు, వెట్టిచాకిరీ వంటి దుర్మార్గమైన వ్యవస్థలను అంతం చేసేందుకు తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం గత 12 ఏళ్లలో ఐదు లక్షలకు పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, యూకే తదితర దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. 2017 నుంచి 2023 మధ్య పంటల బీమా కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని పూర్తిస్థాయిలో అందించకుండా రూ.60 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జించాయని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలు, ఎల్‌నినో ప్రభావం, కరువు సహాయం తదితర డిమాండ్లతో నవంబర్ 26న ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని విజ్జూ కృష్ణన్ ప్రకటించారు.
రైతులను ఆదుకోవాలి: పోతినేని సుదర్శన్
ఏఐకేఎస్తో పాటు దేశవ్యాప్తంగా 450 రైతు సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కార్పొరేట్ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ చెప్పారు. రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడంతోనే ప్రభుత్వ బాధ్యత ముగియదన్నారు. ఇటీవల చర్లపల్లి ప్రాంతంలో పంటలను పరిశీలించామని, పత్తి, వరి, మిర్చి తదితర పంటలు పూర్తిగా ఎండిపోయినట్లు వివరించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రూ.50 వేల కోట్ల నిధులు సాధించి రైతులను ఆదుకోవాలని కోరారు.
రైతు ఉద్యమాలకు నల్గొండ వేదిక..
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డగా నిలిచిన నల్గొండ జిల్లా, భవిష్యత్తులో దేశవ్యాప్త రైతు ఉద్యమాలకు కేంద్రంగా, పోరాట వేదికగా మారబోతుందని 36వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆహ్వాన సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో లక్షా పది వేల రైతు కుటుంబాలను, ఇతర జిల్లాల్లో మరో లక్ష రైతు కుటుంబాలను రైతు సంఘం కార్యకర్తలు, నాయకులు కలిశారని వివరించారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సుమారు 4,500 మంది రైతు బిడ్డలు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. మహాసభల్లో అగ్రి షోలో మొత్తం 200 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఫొటో ఎగ్జిబిషన్‌తో పాటు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
22ఏ నుంచి భూములను తొలగించాలి..
22ఏ నిషేధిత జాబితాలో ఉన్న అర్హులైన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ డిమాండ్ చేశారు. గిరిజన, గిరిజనేతర పేదలకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల అటవీ భూములను అర్హులైన పేదలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం కేవలం 4.20 లక్షల ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చిందని పేర్కొన్నారు. మహాసభల సందర్భంగా 85కి పైగా కొత్త పాటలు రూపొందించడంతో పాటు వివిధ కళారూపాలను సిద్ధం చేసి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం సాయంత్రం నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 15వ తేదీన రెడ్ షర్ట్ వాలంటీర్ల ప్రత్యేక కవాతు, ర్యాలీ ఉంటుందని వెల్లడించారు.

