కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బుధవారంపేట (Budhavarampeta) గ్రామస్తులు మంగళవారం పెద్దపల్లి– మంథని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. గ్రామస్తుల రాస్తారోకోతో పెద్దపల్లి, మంథని మధ్య రాకపోకలు స్థంభించిపోయాయి. సింగరేణి సంస్థ రామగుండం– 3 ఏరియా పరిధిలోని ఓసీపీ–2 విస్తరణలో భాగంగా మండలంలోని బుధవారంపేట పంచాయతీ పరిధిలో భూసేకరణ చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే కొంత భూమి సేకరించగా ఇక్కడ ఉన్న పాత నిర్మాణాలకు పరిహారం కోసం సింగరేణి అధికారులు ఇప్పటికే ఇంటి నంబర్లు వేశారు. అయితే కొందరు పరిహారం కోసం కొత్తగా ఇంటి నిర్మాణాలు చేపట్టారు.
అనుమతి లేకుండా చేపట్టిన ఇంటి నిర్మాణాలను సింగరేణి అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చి వేశారు. తమ పట్టా భూమిలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఏలా కూల్చివేస్తారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసుల జోక్యంతో బుధవారంపేట (Budhavarampeta) గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Read Also: తడోబా టు తెలంగాణ.. సరిహద్దు జిల్లాల్లో పులుల కలకలం
Follow Us On: X(Twitter)


