కలం, వెబ్ డెస్క్ : 1,313.19 ఎకరాల ఆక్రమిత భూములను (చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలు) హైడ్రా (HYDRAA) స్వాధీనం చేసుకుందని.. వీటి విలువ సుమారు రూ. 65,650 కోట్లు ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని లాల్బహద్దూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో `మున్సిపల్ గవర్నెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్` పేరిట 5 రోజుల సదస్సుకు హైడ్రా కమిషనర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయి ప్రసంగించారు.
మూసీ నది పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించి, నది సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. హైదరాబాద్ నగర జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని అందరికీ మెరుగైన, పర్యావరణ హితమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం HYDRAA (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ని తీసుకువచ్చింది అని చెప్పారు. దేశంలోనే ఇలాంటి వ్యవస్థ ప్రప్రథమమని కమిషనర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం :
హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావడం.. అధికారాలు కట్టపెట్టడం తెలంగాణ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం అని కమిషనర్ రంగనాథ్ అభివర్ణించారు. హైదరాబాద్ లో ఉండే చెరువులు, నాలాలను హైడ్రా పునరుద్ధరించి ప్రకృతి చికిత్స చేస్తోందని చెప్పారు. చెరువులతో పాటు వాటిని అనుసంధానం చేసే నాలాలను పరిరక్షించడంతో పాటు పునరుద్ధరిస్తున్నామన్నారు.
ఈ రెండు చర్యలతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు వరద ముప్పును తగ్గించామని తెలిపారు. హైడ్రాను తీసుకువచ్చిన ప్రభుత్వంపైన, హైడ్రా పైనా అనేక విమర్శలు చేసిన రాజకీయ పార్టీలు తర్వాత కొనియాడడం మొదలు పెట్టాయన్నారు. కబ్జాదారులు, ఆక్రమణదారులు హైడ్రాపై బురదజల్లే కార్యక్రమాలను చేపట్టినా.. ప్రజలు వాటిని తిప్పి కొట్టారని హైడ్రాకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించి మద్ధతిచ్చారని కమిషనర్ రంగనాథ్ గుర్తు చేశారు.
Read Also: కవితతో కలిసొచ్చేదెవరు?
Follow Us On: X(Twitter)


