కలం, కరీంనగర్ బ్యూరో: మహారాష్ట్రలోని తడోబాతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తెలంగాణ వైపు వస్తున్న పులుల సంచారంతో సరిహద్దు జిల్లాల ప్రజలు భయాందోళనకు (Tiger Scare) గురవుతున్నారు. నిత్యం ఏదో ఒక జిల్లాలో పెద్దపులి కనిపించిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. తడోబా నుంచి వస్తున్న పలు పులులు కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో తలదాచుకోగా, మరికొన్ని దారి తప్పి తిరుగుతున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దారి తప్పి జనారణ్యంలోకి వస్తున్న పులులను చూసి అటవీ గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.
మహారాష్ట్రలోని తడోబా అడవులతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యం నుంచి పెద్దపులులు వలస వస్తున్నట్లు కనిపిస్తోంది. గత మూడు, నాలుగు ఏళ్లుగా పులుల సంచారంతో కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే పొరుగు రాష్ట్రాల నుంచి ఎన్ని పులులు వచ్చాయనే అంశంపై అటవీ శాఖ అధికారుల వద్ద స్పష్టమైన లెక్కలు లేవు. సుమారు రెండు నుంచి మూడు పులులు తెలంగాణ వైపు వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు నుంచి కాగజ్‌నగర్, ప్రాణహిత నది మీదుగా ఇవి రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి గోదావరి నదిని దాటి కూడా సంచరిస్తున్నాయి.
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ వైపు ఇవి వస్తున్నప్పటికీ, అక్కడ సరైన కారిడార్ లేకపోవడం వల్ల పులులు నిలకడగా ఉండలేకపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ పులులు వచ్చి వెళ్తున్న ప్రతిసారీ పది నుంచి పదిహేను రోజుల పాటు అటవీ గ్రామాల్లో కనిపిస్తుండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఆహారం కోసం ఇవి పశువులపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. 2012లో కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, పులులు అక్కడే నిలదొక్కుకునేలా కారిడార్ సౌకర్యాలను అభివృద్ధి చేయకపోవడంతోనే అవి బయటకు వస్తున్నాయని తెలుస్తోంది.
ట్రాకింగ్ చేస్తున్న అధికారులు..
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన పులుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీ శాఖ నిరంతరం ట్రాకింగ్ చేస్తోంది. ఇవి వేటగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఒక పెద్దపులి రోజుకు 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పులి పాదముద్రల ఆధారంగా అధికారులు వాటి కదలికలను గమనిస్తున్నారు. పులులను గుర్తించేందుకు గత నాలుగేళ్లుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు పులి నేరుగా కెమెరాకు చిక్కకపోవడం గమనార్హం. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకుంటున్న అధికారులు, అటవీ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా పొలం పనులకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. దారి తప్పి వచ్చిన పులులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తున్నాయని వారు చెబుతున్నారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కారిడార్ పనులు పూర్తయితే, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పులులు జనావాసాల్లోకి రాకుండా అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో..
గత వారం రోజులుగా పెద్దపులి కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తిరుగుతుండటం ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటివరకు అటవీ గ్రామాలకు మాత్రమే పరిమితమైన పులి సంచారం (Tiger Movement), ఇప్పుడు మైదాన ప్రాంతమైన కరీంనగర్ వరకు రావడం చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి, బహదూర్ ఖాన్ పేటలో పులి అడుగులను గుర్తించిన అధికారులు, తాజాగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడూకాపూర్ గ్రామంలో కూడా పాదముద్రలను గుర్తించారు. అటవీ ప్రాంతం వదిలి మైదాన ప్రాంతాల్లో పులి తిరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.

Read Also: పాలకుల తీరుతోనే విద్యా వ్యవస్థ నిర్వీర్యం : బండి సంజయ్
Follow Us On: Sharechat


