తిమ్మాపూర్‌లో బీసీ గురుకుల క్రీడా పోటీలు.. ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

కలం, తిమ్మాపూర్: ఒలింపిక్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై స్వర్ణ పతకాలు సాధించడమే ప్రతి క్రీడాకారుడి లక్ష్యం కావాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) అన్నారు. బుధవారం తిమ్మాపూర్ (Thimmapur) మండలం మహాత్మానగర్ పంచాయతీ పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి బీసీ గురుకులాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో భారతదేశం మరిన్ని స్వర్ణ పతకాలు సాధించే దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టైలు అందించడంతోపాటు క్రీడా రంగంలోనూ ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్‌సూట్లు, షూస్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతిభ, పట్టుదల, ఏకాగ్రతతోపాటు పరస్పర స్నేహభావం, క్రమశిక్షణను క్రీడలు పెంపొందిస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో సాగాలని సూచించారు. విద్యార్థులు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ప్రారంభోత్సవానికి ముందు ఎమ్మెల్యే క్రీడాజ్యోతిని వెలిగించారు. అనంతం ఆయన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ గురుకులాలకు చెందిన బాలికలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈనెల 16వ తేదీ వరకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో జరిగే స్పోర్ట్స్, గేమ్స్‌ల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 15 గురుకుల పాఠశాలలకు చెందిన 9,10వ తరగతి చదువుతున్న గురుకుల బాలికలు
525 మంది పాల్గొంటున్నారు.

కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయ అధికారి అంజలీదేవి, ప్రిన్సిపాల్ సరిత, వ్యవసాయ కళాశాల ప్రన్సిపాల్ నరసింహా రెడ్డి, స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్, పాక్స్ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి (నుస్తులాపూర్), గోపు తిరుపతిరెడ్డి (పోరండ్ల), ఒగ్గు దామోదర్ (బెజ్జంకి), ఎస్ఐ జే.నరే, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, పార్టీ నాయకులు రాజేందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, రవీందర్, తిరుపతిరెడ్డి, అనిల్ కుమార్, లక్ష్మారెడ్డి, రమేశ్, రాము, వంశీ, అంజయ్య, అనిల్, సంతోష్, ఆశిక్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>