కలం, నల్లగొండ: యువత వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి మార్గంలో పయనించాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య (Mayor Burri Chaitanya) పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రంలో హైదరాబాద్ న్యాక్ డైరెక్టర్ జనరల్ ఎం. శ్రీనివాస్ రెడ్డితో కలిసి శిక్షణ ప్రయోగశాలలను (Skill Training Labs) ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధితోనే ఉజ్వల భవిష్యత్తును సాధించవచ్చని స్పష్టం చేశారు. మహిళలు, యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా న్యాక్ సంస్థ విశేష సేవలందిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సహకారంతో నల్లగొండలో రూ.20 కోట్ల వ్యయంతో ఈ న్యాక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్థానిక యువత, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
అనంతరం వివిధ కోర్సుల్లో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలు, యువతకు మేయర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ ఎం. రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ. హఫీజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కార్పొరేటర్ మహమ్మద్ ఇబ్రహీం, వివిధ కంపెనీల ప్రతినిధులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.

