కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కీలక ఒప్పందం చేసుకున్నాయి. హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను పంజాబ్‌కు పంపిన ముంబై.. అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది. హార్దిక్ జట్టును వీడటంతో ఇప్పుడు ముంబైకి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయడం సవాలుగా మారింది. 2015లో ముంబై ఇండియన్స్‌లో చేరిన హార్దిక్.. ఆ జట్టు నాలుగు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే టైటిల్ అందించాడు. 2024లో తిరిగి ముంబైకి వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు మారుతున్నాడు. ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లు ఆడి 2,955 పరుగులు, 82 వికెట్లు సాధించాడు.
రూ.18 కోట్లతో ముంబైకి అర్ష్‌దీప్..
అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులో చేరనున్నాడు. 2019 నుంచి పంజాబ్‌కు ఆడుతున్న అతడు.. 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు తీశాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రూ.18 కోట్ల ధరతో ముంబైకి మారుతున్న అర్ష్‌దీప్.. బుమ్రాతో కలిసి బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. హార్దిక్ వెళ్లిపోవడంతో ముంబై కెప్టెన్సీపై ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ముంబై యాజమాన్యం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యం తెలిపింది.

