ఎల్‌నినో ఎఫెక్ట్.. విద్యార్థుల ఫీజులు తగ్గించాలని AISF డిమాండ్!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర కరువుతో నష్టపోయిన రైతులు, కార్మికులు, పేదల పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులను తక్షణమే మాఫీ చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ (Students Fee Waiver) చేశారు. బుధవారం స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మాట్లాడారు.

కరువుతో అప్పుల పాలైన రైతులు, కార్మికులు పిల్లల చదువుల కోసం ఫీజులు కట్టలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి రాము మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కరువు బాధిత రైతులు, కార్మికులు, పేద పిల్లల స్కూలు, కాలేజీల పరీక్ష ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో రైతులు, కార్మికులు, పేదల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని, ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం, తరగతుల నుండి బయటకు పంపడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచకుండా తగ్గించాలని కోరారు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్లలో 50శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు నీటి సమస్య ఉండటం వల్ల హాస్టల్ విద్యార్థులను ఇళ్లకు పంపించడం జరుగుతుందని, తక్షణమే హాస్టళ్లలో ఉన్న నీటి సమస్యలను తీర్చాలని తెలిపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫీజుల కారణంగా విద్యకు దూరం కాకూడదని, రైతు బిడ్డ చదువు ఆగితే ఆ కుటుంబ భవిష్యత్తు ఆగిపోయినట్లేనని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులు, యువజనులను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి రాము, ఏఐవైఎఫ్ జిల్లా కో-కన్వీనర్ మెట్టు మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, అధ్యక్షుడు రాజశేఖర్, ఏఐఎస్ఎఫ్ సీనియర్ నాయకుడు పవన్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>