కలం, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా మాచర్లలో ESL స్కీమ్ (Macherla ESL Scam) పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ పెట్టుబడితో రోజువారీ భారీ లాభాలు వస్తాయంటూ నిర్వాహకులు ప్రజలను ఆకర్షించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.18 వేల పెట్టుబడికి రోజుకు రూ.500, రూ.54 వేలకు రూ.800, రూ.1.30 లక్షల పెట్టుబడికి రోజుకు రూ.2,500 చెల్లిస్తామని ప్రచారం చేశారు. తొలుత కొందరికి నగదు చెల్లింపులు చేసి ప్రజల్లో నమ్మకం కలిగించారు. దీంతో పలువురు అప్పులు చేసి మరీ ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టారు.
మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల మండలాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఈ మోసానికి బాధితులైనట్లు సమాచారం. సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే దసరా పండుగ నుంచి ESL యాప్ పనిచేయడం నిలిచిపోయింది. దీంతో పెట్టుబడిదారులకు రావాల్సిన చెల్లింపులు ఆగిపోయాయి. గతంలో నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందితే విచారణ చేపడతామని మాచర్ల పోలీసులు తెలిపారు. అధిక లాభాల ఆశ చూపే మోసపూరిత యాప్‌లు, పెట్టుబడి పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

