కలం, నిర్మల్: రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ముఖాలను తామే చూసుకోవడం తప్ప వాటివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నప్పుడే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ నేతలకే గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు ఫ్లెక్సీల ఏర్పాటును తప్పుబట్టిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అదే ఫ్లెక్సీ బ్యానర్లతో (BRS Flex Banners) ప్రచార ఆర్భాటానికి దిగడంపై ప్రజల్లో చర్చ మొదలైంది.
2020 మార్చి 1న ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో కేటీఆర్ పర్యటించిన సందర్భంలో అప్పటి మున్సిపల్ చైర్మన్ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఫ్లెక్సీల ఏర్పాటు సరికాదని, వాటివల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. నాలుగు ఫొటోలు చూసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్‌కు లక్ష రూపాయల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. అప్పట్లో ఫ్లెక్సీలపై కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.
మరి ఇప్పుడు ఆ మాటలేవీ..?
కాలం మారింది.. రాజకీయ పరిస్థితులు మారాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రైతు గర్జన (BRS Rythu Garjana) కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే రైతు గర్జనకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ పార్టీ నేతలు పట్టణమంతా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, చౌరస్తాలతో పాటు రోడ్ల మధ్యనున్న డివైడర్లపైనా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
నాయకుల ప్రచార ఆర్భాటం కారణంగా ప్రధాన కూడళ్లలో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాకపోకలకు ఆటంకం కలగడంతో పాటు పట్టణ అందాలకు విఘాతం కలుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు తన పర్యటన సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు(BRS Flex Banners) ఏర్పాటు చేస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాటనా..? అని నిలదీస్తున్నారు. ఇతరులకు నీతులు చెప్పడం సులువే కానీ, తాము చెప్పిన మాటలను ఆచరించడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
Also Read : భారత్ సమ్మిట్ రాజకీయాల కోసం కాదు : శ్రీధర్ బాబు
Follow Us On : WhatsApp

