కలం, వెబ్ డెస్క్: నగరంలో మత్తు పదార్థాల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా మత్తు (Drugs) టాబ్లెట్లు పట్టుబడ్డాయి. మల్లేపల్లి ప్రాంతంలో ఈగల్ టీమ్, హెచ్-న్యూ విభాగం అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 300 నైట్రో-విట్ టాబ్లెట్లను (Nitro-Vit Tablets) స్వాధీనం చేసుకున్నారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన తనిఖీల సందర్భంగా ఉప్పాడ ప్రసాద్, సమీరా బేగం వద్ద ఈ మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పల్లవి, సూర్యధరన్ అనే మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి మత్తు టాబ్లెట్లను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక యువతను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
నగరంలో గంజాయి విక్రయాలపై నిఘా పెరగడంతో కొందరు అక్రమ వ్యాపారులు ప్రత్యామ్నాయంగా మత్తు మాత్రల దందాకు తెరలేపినట్లు అధికారులు భావిస్తున్నారు. యువత మత్తు (Drugs) పదార్థాలకు బానిస కాకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. మత్తు టాబ్లెట్ల అక్రమ సరఫరా, విక్రయాలకు పాల్పడే వారిపై మరిన్ని దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : భారత్ సమ్మిట్ రాజకీయాల కోసం కాదు : శ్రీధర్ బాబు
Follow Us On: Youtube

