కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అక్రమ అండాల సేకరణలో (Egg Donation Racket) దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధి పేరుతో వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను ఇక్కడకు రప్పించి, అక్రమ పద్ధతుల్లో అండాలను సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక సూత్రధారి ప్రవీణ్‌ను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాకుండా ఈ దారుణాల్లో భాగస్వామ్యులైన 20 ఫెర్టిలిటీ సెంటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారంతా రూ.లక్షల్లో తీసుకుంటూ.. అండాలు అందించిన యువతులకు మాత్రం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నారు.
ఫేక్ ఆధార్ కార్డులతో..
ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇక్కడ అండాలు ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ అనే వ్యక్తి యువతులకు ఫేక్ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు ఇస్తూ.. వీరంతా ఇక్కడి వారేనని.. ఇష్టపూర్వకంగా అండాలు ఇస్తున్నారంటూ పలు ఆసుపత్రులను నమ్మించి అండాలు సేకరిస్తున్నట్లు గుర్తించారు. యువతుల్లో ఎక్కువ మంది గుజరాత్ వారే కావడంతో అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సాధారణంగా ఒక మహిళ జీవితకాలంలో ఒకేసారి మాత్రమే అండాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముఠా సభ్యులు మాత్రం ఒక్కో యువతి నుంచి పలుమార్లు అండాలు సేకరిస్తుండటంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : నాకు అదొక సవాల్‌గా మారింది: సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

