కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమం, సాగునీటి సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి, విద్యారంగ విస్తరణకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు రైతు పండుగ నిర్వహించారని తెలిపారు. తన పుట్టినరోజు వేడుకల అనంతరం సమయాన్ని ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించారని పేర్కొన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మూల వనరును జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌కు మార్చడం ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పశ్చిమ మహబూబ్‌నగర్ ప్రాంతానికి అన్యాయం చేసిందని విమర్శించారు. రూ.2,000 కోట్ల అంచనా వ్యయంతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు వేగవంతం చేశామని తెలిపారు. ఉద్దండాపూర్ రిజర్వాయర్ భూసేకరణకు రూ.600 కోట్లు విడుదల చేశామని, మక్తల్ వద్ద సంఘంబండ రిజర్వాయర్ అడ్డంకులను తొలగించి నీటి విడుదలను పునరుద్ధరించామని వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను 299 టీఎంసీలకే పరిమితం చేసి గత ప్రభుత్వం రాష్ట్ర నీటి హక్కులకు నష్టం కలిగించిందని ఆరోపించారు.
కొడంగల్‌లో 5,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందించామని యెన్నం తెలిపారు. ఎల్అండ్టీ, బిర్లా వంటి ప్రముఖ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రూ.5,000 కోట్ల అంచనా వ్యయంతో 250 అడుగుల వెడల్పు, ఎనిమిది వరుసల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని, ఇది అందుబాటులోకి వస్తే శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొడంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు సుమారు గంటా పది నిమిషాల్లో చేరుకోవచ్చని పేర్కొన్నారు.
నారాయణపేట–కొడంగల్ ప్రాంతంలో 250 ఎకరాల్లో మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలలతో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. దీనివల్ల స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన భవిష్యత్తుకు అవకాశాలు లభిస్తాయని అన్నారు. బీఆర్ఎస్ అభివృద్ధి తక్కువగా చేసి, ప్రచారం ఎక్కువగా చేసుకుందని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం నీటి ఎద్దడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, రైతు భరోసా, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులతో పాటు ఆసుపత్రులకు లైన్ ఆఫ్ క్రెడిట్ నిధులను నిరంతరం అందిస్తున్నామని చెప్పారు. ప్రజల సంక్షేమం, ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, రైతులకు సాగునీరు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

