ఈషా గురి.. భారత్ ఖాతాలో స్వర్ణం!

కలం, స్పోర్ట్స్: షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ (Shooting World Championship)లో భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. ఈషా సింగ్ (Esha singh) అద్భుత ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించింది. మరోవైపు ఈషాతో పాటు మను భాకర్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించారు. రెండు రోజుల పాటు జరిగిన క్వాలిఫికేషన్‌లో ఈషా సింగ్ 590 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మను భాకర్ 587, దివ్య సుబ్బరాజు 584 పాయింట్లు సాధించారు. ముగ్గురి స్కోర్లు కలిపి భారత్ 1761 పాయింట్లు సాధించింది. దీంతో టీమ్ గోల్డ్ ఖాతాలో వేసుకుంది. దక్షిణ కొరియా 1748 పాయింట్లతో రజతం, వియత్నాం 1745 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాయి.

వ్యక్తిగత విభాగంలోనూ ఈషా సత్తా చాటింది. సోమవారం జరిగిన ప్రెసిషన్ రౌండ్‌లో 292 పాయింట్లు సాధించిన ఆమె.. మంగళవారం ర్యాపిడ్ రౌండ్‌లో అదరగొట్టింది. వరుసగా 100, 98, 100 పాయింట్లతో మొత్తం 298 సాధించింది. దీంతో ఓవరాల్‌గా 590 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. మరోవైపు మను భాకర్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించింది. ప్రెసిషన్ రౌండ్‌లో 289 పాయింట్లతో నిరాశపరిచినా.. ర్యాపిడ్ రౌండ్‌లో 99, 99, 100 పాయింట్లతో పుంజుకుంది. మొత్తం 587 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. దివ్య సుబ్బరాజు 584 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమైంది.

ఇక వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం పోటీతో పాటు లాస్ ఏంజెలెస్ 2028 ఒలింపిక్స్ కోటా బెర్తులపైనా భారత్ గురిపెట్టింది. ఈ ఈవెంట్‌లో పతకాలు సాధించే ముగ్గురు షూటర్ల దేశాలకు ఒలింపిక్ కోటా లభించనుంది. ఈషా, మను ఇద్దరూ పతకాలు సాధిస్తే భారత్‌కు రెండు కోటా స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జయపాల్ మాల్వియా రజతం సాధించి భారత్‌కు తొలి ఒలింపిక్ కోటా అందించాడు. ఇప్పుడు ఈషా, మను ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>