కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన భార్య అన్నా లెజినోవాతో విడాకులు (Pawan Kalyan Divorce) తీసుకుంటున్నట్లు వచ్చిన తాజా వార్తల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ శ్రేణులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు, విమర్శలు చేయకూడదని పార్టీ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇతరుల గోప్యతను గౌరవించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం పేర్కొంది.
పార్టీ విడుదల చేసిన అధికారిక సూచనల ప్రకారం.. వైసీపీ నాయకులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల్లో పాల్గొనడం గానీ, వ్యక్తిగత విషయాలపై అనుచిత పోస్టులు పెట్టడం గానీ చేయవద్దని స్పష్టం చేసింది. వివాదాస్పద కంటెంట్‌ను షేర్ చేయడం లేదా ఇతరులకు ఫార్వర్డ్ చేయడం పూర్తిగా నిషేధించబడింది. రాజకీయాన్ని, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను వేర్వేరుగా చూడాలని, అన్ని వేదికలపై సంయమనం, బాధ్యత ప్రదర్శించాలని కేడర్‌కు వైఎస్సార్సీపీ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, ఐటీడీపీ కూడా దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత జీవితాలపై చేసే అనుచిత వ్యాఖ్యలతో తమ పార్టీకి లేదా ఐటీడీపీకి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతి ఒక్కరూ గౌరవం, నియంత్రణతో వ్యవహరించాలని, రాజకీయాన్ని కేవలం విధానపరమైన అంశాలకే పరిమితం చేయాలని కోరింది.
Also Read : ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు.. హైకోర్టులో జగన్ పిటీషన్
Follow Us On: Youtube

