ఈనెల 18న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక!

కలం, కరీంనగర్: బీజేపీ అధ్యక్షులు నితిన్ నబిన్ (Nitin Nabin) కరీంనగర్ పర్యటన ఖరారైంది. ఈనెల 18న కరీంనగర్ కు రానున్నారు. ‘సర్’ పేరిట రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నిర్వహించే పాదయాత్రకు హాజరై ప్రసంగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో ‘మహా పాదయాత్ర’ను సక్సెస్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. అందులో భాగంగా కనీసం లక్ష మందితో కరీంనగర్ లో ‘మహా పాదయాత్ర’ చేసేందుకు సిద్దమయ్యారు. గాంధీ సర్కిల్, వైశ్యా భవన్ నుండి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ దాకా నిర్వహించే ఈ ‘మహా పాదయాత్ర’లో లక్ష మందితో కలిసి నితిన్ నబిన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, బండి సంజయ్ అడుగులో అడుగు వేయనున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ‘మహా పాదయాత్ర’ ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, గంగాడి క్రిష్ణారెడ్డి, సీనియర్ నేతలు కోమాల అంజనేయులు, నల్లాల ఓదేలు, మోహన్ రెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు, గుజ్జ శ్రీను, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కోహెడ వెంకన్న, తిరుపతిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరు మారుమోగేలా మహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ’సర్’ పై కాంగ్రెస్, ఇండీ కూటమి పేరుతో విపక్షాలు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘాన్ని నీరుగార్చే కుట్రలతో రాజ్యంగ సంస్థలపై దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే నితిన్ నబిన్ కరీంనగర్ వస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘మహా పాదయాత్ర’ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కనీసం లక్ష మంది ఈ యాత్రకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా హాజరుకానున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ కేంద్రాల నుండి శక్తి కేంద్రాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కోరారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా మహా పాదయాత్రపై విసృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>