కలం, నిర్మల్: ప్రజావాణి దరఖాస్తుల (Prajavani Petitions) పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.
మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవ రావు, రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

