కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ హయాంలో కట్టించిన మేడిగడ్డ కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి తరచూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar) సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ కూలిపోలేదని, కుట్రపూరితంగా బాంబులు పెట్టి కూల్చారని వ్యాఖ్యానించారు. ఆరోజు రాత్రి బాంబ్ పేలింది, ఎవరో కుట్ర పన్నారని రైతులు తనకు చెప్పారని వెల్లడించారు. అయినా ఒకవేళ మేడిగడ్డతో సంబంధం లేకున్నా కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి కావాలనే నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో విద్యుత్ కొరత, మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు అడ్వాన్సులు చెల్లించి రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూసేదని, ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో విఫలమై చేతులెత్తేసిందని విమర్శలు గుప్పించారు. తనపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. తాను ప్రజాసేవ కోసం వేల ఎకరాల ఆస్తిని అమ్ముకున్నానని, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఏడుసార్లు ప్రజల మద్దతుతో గెలిచానని గుర్తు చేశారు.
అయితే గతంలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ, ఆర్టీఐ పేరిట దందాలు, బ్లాక్మెయిల్ రాజకీయం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ పాలనపై సంతోషంగా ఉన్నారన్న సీఎం వ్యాఖ్యలకు సవాల్ విసురుతూ, దమ్ముంటే భద్రత లేకుండా తనతో పాటు ఊళ్లలోకి వచ్చి ప్రజాభిప్రాయాన్ని చూడాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రజలను కాంగ్రెస్ సర్కార్ అప్పులపాలు చేస్తుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో స్థలాలు కొని రూ. 20 లక్షలతో ఇండ్లు కట్టించామని వెల్లడించారు.

