epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇక మహానగరంగా నల్లగొండ మున్సిపాలిటీ

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) మున్సిపాలిటీ మహానగరంగా రూపుదిద్దుకుంది. దాదాపు 75 ఏండ్ల క్రితం 12 వార్డులతో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ప్రస్థానం మొదలుపెట్టిన నల్లగొండ.. ఎట్టకేలకు కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. 1951లో కేవలం 12 వార్డులతో మొదలై.. 2018లో బీఆర్ఎస్ సర్కారు హయాంలో నల్లగొండ పట్టణం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా రూపుదిద్దుకుంది. తాజాగా నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంకణం కట్టుకున్నారని చెప్పాలి. నిజానికి యావత్ తెలంగాణలో కార్పొరేషన్ లేని జిల్లా ఏదైనా ఉందంటే.. అది ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాననే చెప్పాలి.

గత సర్కారు హయాంలో 2018లోనే నల్లగొండను కార్పొరేషన్‌గా చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. కానీ సరిపడా జనాభా లేకపోవడంతో చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను నల్లగొండ మున్సిపాలిటీలో విలీనం చేసి కార్పొరేషన్‌గా చేయాలని సంకల్పించింది. నల్లగొండ మండలంలోని కొత్తపల్లి, అన్నపర్తి, చందనపల్లి, దండెంపల్లి, దుప్పలపల్లి, కంచనపల్లి గ్రామాలు, తిప్పర్తి మండలంలోని దుప్పలపల్లి గ్రామాలను తీసుకుని కార్పొరేషన్‌గా రూపుదిద్దాలని ప్రయత్నించింది. కానీ ఆయా గ్రామాల ప్రజలు మమ్మల్ని వీలినం చేయోద్దంటూ పెద్దఎత్తున నిరసన తెలిపారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

కొర్పొరేషన్‌గా చేసేందుకు కోమటిరెడ్డి పట్టు..

నల్లగొండ మున్సిపాలిటీలో ప్రస్తుతం 2.50 లక్షల వరకు జనాభా ఉన్నట్టు అధికారుల అంచనా. 2022లోనే నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 2.25 లక్షల జనాభా ఉన్నట్టు తెలింది. ఈ మూడేండ్ల కాలంలో మరో 10వేల మంది జనాభా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో ఏ గ్రామాలను విలీనం చేయకుండానే కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు వీలుచిక్కింది. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) నల్లగొండను కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే తాజాగా అసెంబ్లీలో నల్లగొండ కార్పొరేషన్ అప్‌గ్రేడ్ బిల్లును ఆమోదించారు. దీంతో నల్లగొండ మున్సిపాలిటీ వాసులతో పాటు రాజకీయ నేతల్లోనూ సరికొత్త జోష్ కన్పిస్తోంది. కౌన్సిలర్ల స్థాయి నుంచి కార్పొరేటర్లుగా మారడంతో పాటు మున్సిపల్ చైర్మన్ నుంచి మేయర్ పదవికి అప్‌గ్రేడ్ కానుండడంతో రాజకీయ నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం వరంగా మారనుందనే చెప్పాలి.

పెరగనున్న డివిజన్లు.. మారనున్న హద్దులు..

నల్లగొండ (Nalgonda) స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ప్రస్తుతం 48 వార్డులు ఉన్నాయి. అయితే ఈ 48 వార్డులను 50 డివిజన్లుగా విభజించే అవకాశం ఉంది. మొదటి 24 వార్డుల నుంచి అదనంగా ఒక డివిజన్, 24 వార్డుల నుంచి 48 వార్డుల వరకు మరో డివిజన్ పెంచనున్నారు. దీంతో నల్లగొండ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఏర్పాటు కానున్నారు. అందుకోసం 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని మహానగరంగా మార్చనున్నారు. దీంతో ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీలో ఉన్న వార్డుల రూపురేఖలు మారనున్నాయి. కొత్త హద్దులతో డివిజన్లు ఏర్పాటు అవ్వనున్నాయి.

ఇదే జరిగితే.. కొన్ని వార్డులను ఇప్పటివరకు అంటిపెట్టుకుని వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేసిన లీడర్లకు నష్టం వాటిల్లనుంది. వార్డుల రూపురేఖలు మారితే.. డివిజన్లు విస్తరించడంతో పాటు హద్దులు మారడం వల్ల ఓటర్లు తారుమారు కానున్నారు. దీంతో ఆయా డివిజన్లలో మళ్లీ మొదటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి వస్తుందనే ప్రచారం లేకపోలేదు. కానీ కొంతమంది లీడర్లకు మాత్రం డివిజన్లు మారితే ప్రయోజనకరంగా ఉండనుంది. ఇదిలావుంటే.. ఒక్కో డివిజన్‌లో 3 వేల నుంచి 3500 మంది వరకు ఓటర్లు ఉండనున్నారు. ఏదీఏమైనప్పటికీ నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయించడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంతం నెగ్గించుకున్నారనే చెప్పాలి.

Read Also: అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు.. ఎన్నికల వేల జోరుగా వలసలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>