వనపర్తిలో జోరుగా బాణసంచా వ్యాపారం.. అధికారుల తనిఖీలు ఏవి?

కలం, వనపర్తి: దీపావళి పండుగ సందర్భంగా వనపర్తి (Wanaparthy Fireworks) జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల్లో భారీగా వ్యాపారం సాగుతోంది. కోట్ల రూపాయల విలువైన విక్రయాలు జరుగుతున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీఎస్టీ చెల్లింపులు, విక్రయ బిల్లులు, ఆదాయపు పన్ను లావాదేవీలపై పారదర్శకత ఉండాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. వ్యాపార నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని వినియోగదారులు, ప్రజలు కోరుతున్నారు.

బాణసంచా విక్రయించే వ్యాపారులు నిబంధనల ప్రకారం.. జీఎస్టీ నమోదు కలిగి ఉంటే విక్రయాలకు తగిన పన్ను ఇన్వాయిస్‌లు జారీ చేయాలి. సీబీఐసీ నిబంధనల ప్రకారం.. హెచ్‌ఎస్‌ఎన్‌ 3604 పరిధిలోని బాణసంచాపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఇందులో 9 శాతం సీజీఎస్టీ, 9 శాతం ఎస్‌జీఎస్టీ ఉంటాయి. అయితే ప్రతి దుకాణానికి జీఎస్టీ నమోదు తప్పనిసరా అనేది వారి వ్యాపార పరిమాణం, వర్తించే నిబంధనల ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది.

మరోవైపు బాణసంచా దుకాణాల ఏర్పాటుకు పేలుడు పదార్థాల నిబంధనలు–2008 ప్రకారం సంబంధిత లైసెన్సులు తప్పనిసరి. తాత్కాలిక దుకాణాలకు లైసెన్సింగ్‌ విధానం, నిల్వ పరిమితులు, దుకాణాల నిర్మాణం, అగ్నిమాపక వాహనాలు చేరుకునే మార్గం, అత్యవసర బయటకు వెళ్లే ద్వారాలు వంటి భద్రతా అంశాలను అధికారులు పరిశీలించాలి. దుకాణాల్లో అగ్నిమాపక పరికరాలు, విద్యుత్‌ వైరింగ్‌ భద్రత, జనసంచారం నుంచి తగిన దూరం వంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ఆదాయపు పన్ను లావాదేవీలపైనా నిఘా అవసరం

భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగితే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం–2025లోని సెక్షన్‌ 186 ప్రకారం ఒక వ్యక్తి నుంచి ఒక రోజులో, ఒకే లావాదేవీలో లేదా ఒకే సందర్భానికి సంబంధించి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నిర్దేశిత బ్యాంకింగ్‌ లేదా ఎలక్ట్రానిక్‌ విధానాలకు విరుద్ధంగా నగదు రూపంలో స్వీకరించడంపై ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వనపర్తిలోని బాణసంచా దుకాణాల విక్రయాల వివరాలు, కొనుగోలు బిల్లులు, స్టాక్‌ రిజిస్టర్లు, జీఎస్టీ ఇన్వాయిస్‌లు, బ్యాంకు లావాదేవీలు, ఆదాయపు పన్ను రికార్డులను సంబంధిత శాఖలు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే అధికారులు తనిఖీలపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలతో పాటు ముడుపుల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

ప్రజల డిమాండ్‌ ఒక్కటే.. బాణసంచా వ్యాపారంపై జీఎస్టీ, వాణిజ్య పన్నులు, ఆదాయపు పన్ను శాఖలు సమన్వయంతో తనిఖీలు చేపట్టాలి. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు దుకాణాల భద్రతను పరిశీలించాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడటంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>