కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలో సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం పదునైన ఆయుధాలతో విన్యాసాలు (Weapon Stunts) చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు యువకులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఖమ్మం నగరం పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన దొడ్ల చరణ్, దమళ్ళ సూర్య అనే ఇద్దరు వ్యక్తులు కత్తులు, గొడ్డళ్ళతో విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం త్రీ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో పదునైన ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని ఆయన హెచ్చరించారు. ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. యువత ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.

