కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (Thimmapur) మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధురాళ్ల వరుస హత్యల కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బంగారం, వెండి ఆభరణాల కోసమే ఒంటరి వృద్ధురాళ్లను అత్యంత క్రూరంగా హతమార్చిన నలుగురు నిందితుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిమ్మాపూర్ పరిధిలోని వచ్చనూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి భూదమ్మ (103), ఉప్పులేటి లక్ష్మి అలియాస్ లచ్చవ్వ (80) లను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు.
ఒంటరిగా ఉంటున్న వారి ఇంట్లోకి చొరబడి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం రాకుండా వృద్ధాప్యం కారణంగానే వారు సహజంగా మరణించారని నమ్మించి అంత్యక్రియలు కూడా జరిగేలా కుట్రపన్నారు. మొదటి హత్యలో గుట్టు రట్టు కాకపోవడంతో అదే గ్రామానికి చెందిన మరో వృద్ధురాలిని కూడా ఇదే పద్ధతిలో హత్య చేసి వారి వద్ద ఉన్న వెండి కడియాలు, బంగారు ఆభరణాలను అపహరించారు. దొంగిలించిన ఆభరణాలను కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో తిమ్మాపూర్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అలుగునూర్ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణానికి పాల్పడిన వచ్చనూర్కు చెందిన మద్దూరి సాయి, పోరంట్లకు చెందిన కిన్నెర రాజు, కొత్తపల్లికి చెందిన ఎల్కతుర్తి రాజు, మానుకోల పవన్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కనపర్తి మణికంఠ పరారీలో ఉన్నాడు.
నిందితుల నుంచి టీవీఎస్ జూపిటర్, బజాజ్ పల్సర్ బైక్‌లతో పాటు వెండి కడియాలు, 5 సెల్ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రూరల్ ఏసీపీ, తిమ్మాపూర్ సీఐ, ఎస్సైలు, సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ఒంటరిగా ఉండకూడదని, విలువైన ఆభరణాలు ధరించి బయట తిరగకుండా కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. నేరాల నియంత్రణ కోసం ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

