ఇల్లందులో దొంగల ముఠా గుట్టురట్టు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పట్టణంలో గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు (Yellandu Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27.51 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని, మొత్తం 10 కేసులను విజయవంతంగా ఛేదించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం మీడియాకు వెల్లడించారు.

ఇల్లందు పరిధిలోని జేకే కాలనీ, సుభాష్ నగర్, ఆజాద్ నగర్, బెంగల్ రావు కాలనీ ప్రాంతాల్లో వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఈ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు నిఘా పెంచి, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు వెలుగులోకి వచ్చాయి. ఇల్లందులోని 14వ నంబర్ బస్తీకి చెందిన లోద్ విశాల్ కుమార్, 15వ నంబర్ బస్తీకి చెందిన గౌతమ్ లోద్, అలాగే అదే బస్తీకి చెందిన కోరి కల్యాణ్‌లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుల నుంచి మొత్తం 165 గ్రాముల బంగారంతో పాటు, 2 కిలోల 205 గ్రాముల వెండి, ఒక ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో బంగారం విలువ రూ.23,10,000 కాగా, వెండి విలువ రూ.4,41,000 ఉందని, మొత్తం కలిపి రూ.27,51,000 విలువైన ఆస్తులను రికవరీ చేసినట్లు వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, సీఐ సురేష్‌తో పాటు పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. కాలనీల్లో ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>