కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nijamabad) జిల్లాలో ఓ పులి పిల్ల (Leopard Cub) పొలాల్లో సంచరిస్తోంది. వేల్పూర్ మండలంలోని మోతె, భీమ్ గల్ మండలంలోని బడా భీమ్ గల్ గ్రామాల సరిహద్దులో పులి పిల్ల సంచరిస్తోందని సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొట్టింది. మోతె శివారు నుంచి భీమ్ గల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వెనుక తిరుగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమ్ గల్ పోలీసులు తెలిపినట్లు వాట్సాప్ గ్రూపులలో ప్రచారం జరిగింది.
మరోవైపు అది చిరుతపులి పిల్ల కాదని, అడవిలో తిరిగే జంగపిల్లి అని చాలా మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో అది చిరుతపులి పిల్ల అవునా, కాదా? అనే అనుమానం ప్రజల్లో కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో అది పులి పిల్లనా కాదా? తల్లి పులి కూడా ఉందా అనే కోణంలో తేల్చడానికి రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాలలో గాలింపు చేపట్టారు.

