కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, నాణ్యమైన శిక్షణ అందిస్తే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు దీటుగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న పయనీర్ కార్యక్రమం ద్వారా ప్రతి యేడాది వంద మంది విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించి, వైద్య, ఇంజినీరింగ్‌తో పాటు పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉచితంగా ప్రవేశాలు పొందడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పయనీర్ కార్యక్రమం ద్వారా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానం, సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో మహబూబ్‌నగర్ ఫస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్లుగా ప్రతి సంవత్సరం వంద మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే స్థాయికి చేరుకోవడం పయనీర్ కార్యక్రమం విజయానికి నిదర్శనమన్నారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ముందుకొచ్చిన వాగ్దేవి, ప్రతిభ, ఋషి జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు, ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కళాశాలల అధ్యాపకులను కేటాయించి, నెలల తరబడి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అందించడం అభినందనీయమన్నారు. ఈ సహకారం వల్లే విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించగలిగామని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులను అధిగమిస్తూ కష్టపడి చదివారని, కళాశాల సమయం ముగిసిన తర్వాత కూడా అదనంగా రెండు గంటల పాటు శిక్షణ పొందారని గుర్తుచేశారు. వారి కృషి, అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం కలిసి మంచి ఫలితాలు సాధ్యం అయిందని తెలిపారు.
ప్రస్తుతం విద్యార్థులు వైద్య, ఇంజినీరింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ , వెటర్నరీ, బయోటెక్నాలజీ తదితర ప్రొఫెషనల్, సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు. నగరంలో టాస్క్ ద్వారా కూడా విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలను మరో పదేళ్ల పాటు కొనసాగిస్తే వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాధించిన విజయమే అంతిమ లక్ష్యం కాదని, ఇది భవిష్యత్తుకు తొలి అడుగు మాత్రమేనని ఆయన విద్యార్థులకు సూచించారు. తాము ఎంచుకున్న కోర్సులను పూర్తిస్థాయి ఏకాగ్రతతో చదువుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు అభ్యసించే మూడు, నాలుగేళ్ల కాలం విద్యార్థుల జీవితంలో ఎంతో విలువైనదని, ఈ సమయంలో ఇతర ఆకర్షణలకు దూరంగా ఉంటూ చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు. కేవలం డిగ్రీలు పొందడమే కాకుండా, ఆయా కోర్సుల్లోని విషయ పరిజ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకుని, నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
క్రమశిక్షణతో ముందుకు సాగుతూ తల్లిదండ్రులకు, చదువు చెప్పిన అధ్యాపకులకు, చదువుకున్న కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ విజయాలను, సర్టిఫికెట్లను, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. ఇవి భవిష్యత్తులో మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెప్పారు. ప్రతి కుటుంబంలోని బిడ్డ ఉన్నత విద్యను అభ్యసించి, స్వశక్తితో నిలబడి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నదే తమ లక్ష్యమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు దాతలు, విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు సమష్టిగా సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం పయనీర్ ప్రత్యేక శిక్షణ ద్వారా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డీఐఈఓ చిలుక రమణి, బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలీముద్దీన్, వాగ్దేవి జూనియర్ కళాశాల డైరెక్టర్ విజేత వెంకట్ రెడ్డి, ప్రతిభ జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, రిషి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, కార్పొరేటర్లు అనుప ఆంజనేయులు, ప్రశాంత్ , సోషల్ మీడియా కన్వీనర్ ఏర్పుల నాగరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు సిరిగిరి మురళి, నాయకులు మైత్రి యాదయ్య , తుప్పలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

