ఖమ్మంలో గంజాయి కలకలం.. పట్టుబడ్డ ముగ్గురు డ్రైవర్లు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలో గంజాయి మత్తు కలకలం రేపింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల తనిఖీల్లో మాదకద్రవ్యాలు సేవిస్తున్న (Cannabis Consumption) ముగ్గురు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు. ఎబాన్ యూరిన్ టెస్ట్ కిట్లతో నిర్వహించిన పరీక్షల్లో వారు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది.

​ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వి. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఇందిరానగర్ వద్ద గల శ్మశానవాటిక ముందు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాము గంజాయికి బానిసలయ్యామని అంగీకరించారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని శాస్త్రీయంగా ధృవీకరించడానికి పోలీసులు ఎబాన్ యూరిన్ టెస్ట్ కిట్లను ఉపయోగించి స్పాట్‌లోనే పరీక్షలు నిర్వహించారు.

​చైతన్యగర్ ఇందిరానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కుర్రా రాజేశ్వర్ @ రాజేష్ (30), పాండురంగపురానికి చెందిన డ్రైవర్ బంకా సురేష్ (27), రోటరీనగర్‌కు చెందిన డిసిఎం డ్రైవర్ వట్టికోటి నరేష్ (36) గంజాయి సేవించినట్లు ఈ పరీక్షల్లో తేలింది. ఈ ముగ్గురు వ్యక్తులకు నిర్వహించిన యూరిన్ టెస్టుల్లో ‘THC పాజిటివ్’ అని నిర్ధారణ అయిందని సబ్-ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.నిందితులను వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్ ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. వాహనాలు నడిపే డ్రైవర్లే ఇలా గంజాయి బారిన పడటం నగరంలో ఆందోళన కలిగిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>