కలం, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) వెల్లడించారు. శుక్రవారం ఆయన హుజూర్ నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ కాలనీలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.
ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుదీకరణ, స్ట్రీట్ లైట్లు, గ్రీనరీ (హరితహారం), తాగునీటి వసతులు, పైలాన్ స్తూపం, సభాస్థలి ప్రదేశాలను నిశితంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన నిర్మాణ, అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోకుండా నిరంతరం నీరు అందిస్తూ సంరక్షించాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా సూక్ష్మ స్థాయిలో పరిశీలించి, అత్యంత అర్హులైన పేదలకే ప్రాధాన్యం ఇస్తూ ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ జబ్బార్‌లతో పాటు సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

