కలం,మెదక్ బ్యూరో: జాతీయ రహదారులపై ఒంటరిగా ఉన్న కార్లను లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు (Sangareddy Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ ఎయిర్ పిస్టల్, రెండు కత్తులు, నెంబర్ ప్లేట్ లేని బైక్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో వరుసగా దారి దోపిడీలు జరుగుతుండం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీఎస్, జహీరాబాద్ సబ్ డివిజన్, సదాశివపేట పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరిపి తెలంగాణలో మూడు కేసులు, కర్ణాటకలోని ఒక కేసును ఛేదించాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నేరస్థుల ముఠా రాత్రి వేళల్లో బైక్‌పై జాతీయ రహదారులపై తిరుగుతుంటారు.
పిస్టల్, కత్తులతో బెదిరించి..
అత్యవసరాల కోసం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కార్లను గుర్తించి.. మంకీ క్యాప్‌లు ధరించి, నకిలీ ఎయిర్ పిస్టల్, కత్తులతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు లాక్కుని లాతూర్ పారిపోయేవారని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అలా అపహరించిన సొత్తును అక్కడ విక్రయించి డబ్బు పంచుకునేవారు. ఈ క్రమంలో మరోసారి తెలంగాణలో దోపిడీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిఘా పెట్టి చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాడ్గి చౌరస్తా వద్ద నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై వస్తుండగా పోలీసులు తనిఖీలు జరిపి వీరిని అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.

