కలం, నిర్మల్ : ఈ నెల 17 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026కు బాసర జోన్ క్రికెట్ జట్లు (Basara Zone Cricket Team) సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలోని లక్కీ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీలో (Kondapur Academy) నిర్వహిస్తున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లను శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల వీక్షించారు. క్రీడాకారుల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలను పరిశీలించి వారిని ప్రోత్సహించారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సైతం పాల్గొన్నారు. రాబోయే పోటీల్లో క్రీడాకారులు క్రమశిక్షణ, జట్టు సమన్వయంతో ప్రతిభ కనబరచాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

