కలం, వెబ్ డెస్క్ : మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల (Common Pass Price) ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సామాన్య ప్రజలపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సవరణ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ తగ్గించిన ధరలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
నూతన ధరల ప్రకారం, రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.400 నుంచి రూ.275కు తగ్గించారు. దీనివల్ల రోజువారీ ప్రయాణికులకు రూ.125 ప్రయోజనం చేకూరనుంది. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుంది. ఇందులో మెట్రోకు రూ.200, ఆర్టీసీకి రూ.75 కేటాయిస్తారు.
అలాగే నెలవారీ ఉమ్మడి పాస్ ధరను రూ.8,500 నుంచి సగానికి పైగా తగ్గించి రూ.4,000గా నిర్ణయించారు. దీంతో ప్రతి నెల ప్రయాణికులకు రూ.4,500 ఆదా కానుంది. ఈ పాస్‌పై నెలలో గరిష్టంగా 50 మెట్రో సింగిల్ ట్రిప్పులకు అవకాశం ఉండగా, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎటువంటి పరిమితులు ఉండవు. ఈ విభజనలో మెట్రోకు రూ.3,000, ఆర్టీసీకి రూ.1,000 దక్కుతాయి. ప్రభుత్వ ఈ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు ఎంతో ఊరటనిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

