కలం, ఖమ్మం బ్యూరో: మురసు తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కురిసిన అత్యంత భారీ వర్షాలకు తీవ్ర నష్టం (Flood Damage) వాటిల్లింది. భారీ వరదల కారణంగా గండిపడిన స్థానిక వెంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) శుక్రవారం పరిశీలించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురసు తుఫాన్ కారణంగా ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదైందని, వాగులు, వంకలు పొంగిపొర్లి ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించాయని తెలిపారు.
ఈ వరదల ఉద్ధృతికి ఉద్యాన పంటలు, వరి పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని, పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పంట నష్టం, రహదారుల మరమ్మతులకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సాయంత్రంలోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పామాయిల్ సాగు రైతులకు భరోసా..
అత్యంత భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ పామాయిల్ సాగుకు పెద్దగా నష్టం వాటిల్లకుండా పంట నిలబడటం విశేషమని మంత్రి తెలిపారు. అతివృష్టి, అనావృష్టి వంటి అసమతుల్య వాతావరణ పరిస్థితులు తరచూ ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో పామాయిల్ సాగు రైతాంగానికి ఒక వరంగా మారుతోందని ఈ విపత్తు మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, పంట నష్టం అంచనా, రహదారుల పునరుద్ధరణ, దెబ్బతిన్న చెరువుల మరమ్మతులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల భరోసానిచ్చారు.
కాగా, ఎటువంటి హంగు ఆర్భాటాలకు తావులేకుండా, ఒక సాధారణ వ్యక్తిలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ప్రాంతాలను ఆయన శుక్రవారం ఉదయం స్వయంగా పరిశీలించారు.
మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లు కోతకు గురికావడంతో పాటు పెద్ద ఎత్తున వరి పంటకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కార్లు, కాన్వాయ్‌ను పక్కనపెట్టి ద్విచక్ర వాహనం (బైక్)పై స్వయంగా ప్రయాణిస్తూ మంత్రి గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులను ప్రత్యక్షంగా వీక్షించారు. బురదమయమైన పొలాల గట్లు, దెబ్బతిన్న రహదారులపై బైక్‌పైనే ప్రయాణిస్తూ రైతులు, స్థానిక ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కేవలం అధికారుల రాతపూర్వక నివేదికల కోసం ఎదురుచూడకుండా, స్వయంగా రంగంలోకి దిగి బైక్‌పై తిరిగి నష్టాన్ని పరిశీలించడం పట్ల స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ఈరోజు సాయంత్రం లేదా శనివారం ఉదయానికల్లా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. కష్టకాలంలో అర్హులైన ప్రతి రైతుకూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు.

