కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: జిల్లాలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి పోలీస్ అధికారి ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా పటిష్టమైన ఆధారాలతో కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జానకి అధ్యక్షతన నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలను సమీక్షించి పోలీస్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ: ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులను సమీక్షిస్తూ, వాటి పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, అవసరమైన సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించాలని, నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం, జాప్యం సహించబోమని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. భరోసా కేంద్రం, షీ-టీమ్స్ ద్వారా బాధితులకు తక్షణ సహాయం అందించాలని, మహిళల భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలపై నేరాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ కేసులు, మిస్సింగ్ కేసులు, రౌడీ షీట్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
జిల్లాలో గంజాయి తదితర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత, విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత
సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి అవసరమైన సహాయం అందించాలని అధికారులకు సూచించారు. సైబర్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సీసీటీఎన్ఎస్ 2.0లో పెండింగ్ వివరాలను సకాలంలో నమోదు చేయాలని, నాట్ గ్రిడ్, గాండీవ వెబ్ అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు పోలీస్ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని, నేరాల నియంత్రణలో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూటౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, SB ఇన్స్పెక్టర్ రవి బాబు, ఐటీ సెల్ సబ్ ఇన్స్పెక్టర్లు రవి, ఇతర ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

