కలం, కరీంనగర్: ఆత్మీయుల జ్ఞాపకాలను వెలుగుల మయం చేస్తూ కరీంనగర్ ప్రజలు జరుపుకునే దీపావళి ‘సమాధుల పండుగ’ మానవ సంబంధాలకు, పూర్వీకుల పట్ల ఉన్న గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. దీపావళి పండుగ అనగానే ప్రతీ ఇల్లూ ప్రమిదల వెలుగులతో, లక్ష్మీ పూజలు, పిండివంటలు, బాణసంచా శబ్దాలతో సందడిగా మారుతుంది. కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలో దీపావళి వేడుకలకు ఒక ప్రత్యేకమైన, ఆసక్తికరమైన సాంప్రదాయం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ మరణించిన తమ పూర్వీకులను, ఆత్మీయులను స్మరించుకుంటూ స్మశాన వాటికల్లోనే దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి ప్రత్యేకత ఉన్న దీపావళి వేడుకలు నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఘనంగా జరుగుతాయి.
మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత ఆరు దశాబ్దాల ఆచార వ్యవహారాల ప్రకారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్ఖానాగడ్డ, కాశ్మీర్‌గడ్డ, ఆదర్శ్‌నగర్, సవరణ్ స్ట్రీట్ ప్రాంతాల్లో ఉన్న హిందూ శ్మశాన వాటికలతో పాటు విలీన గ్రామాల డివిజన్లు అయిన 3 వ డివిజన్ సంతోష్ నగర్, వల్లంపహాడ్ గ్రేవీయార్డు, 19 వ డివిజన్ వెంకటేశ్వర కాలనీ, బెడబుడగ జంగాల గ్రేవీయార్డు తో పాటు 14,16,18,19,20,29,26,52 డివిజన్ల పరిదిలోని చింతకుంట, కొత్తపల్లి, మల్కాపూర్, రేకుర్తి, కిసాన్ నగర్, కార్ఖానగడ్డ, కాశ్మీర్ గడ్డ, ఆదర్శనగర్, గోదాంగడ్డ ప్రాంతాల్లో గల ఎస్సీ స్మశాన వాటికల్లో సమాధుల పండుగకు నగరపాలక సంస్థ ద్వారా అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. పూర్వీకుల జ్ఞాపకాలను గుర్తు చేసుకొని… పూర్వీకుల పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచే ఒక గొప్ప సాంప్రదాయ పండగ దీపావళి సమాదుల పండగ అన్నారు. నగర వ్యాప్తంగా దీపావళి రోజు లక్ష్మి, కేదారేశ్వర వ్రతాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల శబ్ధాలతో సందడిగా వేడుకలు సాగితే… నగరంలోని సంబంధిత ప్రాంతాల్లో మాత్రం సమాదుల్లో దీపావళి వేడుకలు జరగడం చాలా విశేషం అన్నారు. ప్రతి ఏటా సమాధుల పండుగకు వేలాది మంది ప్రజలు శ్మశాన వాటికలకు తరలివచ్చి పండగను జరుపుకోవడం దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
గతం కంటే విలీన గ్రామ డీవిజన్ల స్మశాన వాటికలను కలుపుకొని పెద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించి.. నగరంలోని ప్రధాన శ్మశాన వాటికల వద్ద ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించి పిచ్చిమొక్కలను తొలగించడం, బ్లీచింగ్ చల్లడం, స్మశాన వాటికల పహారి గోడలకు పేయింటింగ్ లాంటి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణలో భాగంగా సాయంత్రం పూట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్మశాన వాటిక ప్రాంగణాల్లో హైమాస్ట్ లైట్లు, తాత్కాలిక ఎల్ఈడీ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
విచ్చేసే భక్తులు, స్థానికుల కోసం తాగునీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. శ్మశాన వాటికల మార్గాల్లో రద్దీ ఏర్పడకుండా పోలీసు శాఖ సహకారంతో వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతం కంటే ఘనంగా నగరపాలక సంస్థ ద్వారా దీపావళి పర్వదినం వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీపావళి వేడుకలు నగర ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని మేయర్ పిలుపు నిచ్చారు. నగర ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

