కలం, జోగులాంబ గద్వాల: విద్యార్థులు చదువుతోపాటు సంగీత, నృత్య, చిత్రలేఖన తదితర కళా రంగాల్లోనూ రాణించడం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) అన్నారు. గద్వాల బాల భవన్ విద్యార్థులు అనన్య, సుస్వర ప్రియ, సాహితీప్రియ, పూజ్యశ్రీత అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మూడు రోజులపాటు నేషనల్ బాల భవన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన జాతీయ బాలల సదస్సు, ఏకీకరణ శిబిరంలో పాల్గొని తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఎస్కార్ట్‌గా వెళ్ళిన వాయిద్య శిక్షకులు బోడ శంకర్‌ను గురువారం ఐడీఓసీలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీలో విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనల గురించి, అక్కడ ఇతర రాష్ట్రాల విద్యార్థులతో వారి అనుభవాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మన దేశంలో విభిన్న భాషలు మాట్లాడే, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ప్రజలు జీవిస్తున్నప్పటికీ మనమంతా భారతీయులమే కాబట్టి కలిసి మెలిసి జీవిస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఏకీకరణ శిబిరం ముఖ్య ఉద్దేశం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించడమేనని పేర్కొన్నారు. అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి భిన్న కళా రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులు రావడంతో అందరిలో స్నేహ సంబంధాలు పెంపొందించబడతాయని చెప్పారు.
కళా రంగాల్లో సాధనతో క్రమశిక్షణ
మన భారతీయ సనాతన, సంప్రదాయ నృత్యాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని, ఎంతో మంది విదేశీయులు సైతం భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సి వంటి నృత్య రీతుల్లో శిక్షణ పొందుతుండటమే ఇందుకు నిదర్శనమని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ కళల్లో రాణించడం వలన క్రమశిక్షణ అలవడుతుందని, ఆదర్శనీయమైన జీవన విధానానికి కళలు మార్గదర్శనం చూపుతాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. కళాకారులు తమ ప్రదర్శనలతో మానసిక ఆనందాన్ని పొందుతారని, ప్రేక్షకులు సైతం సంతోషించడానికి విభిన్న కళలు దోహదపడతాయన్నారు. ఎంతోమంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటి అవార్డులు, రివార్డులు పొందడం జరిగిందన్నారు. ఆయా కళలను చాలా మంది వృత్తిగా చేపట్టి ఔత్సాహిక విద్యార్థులకు శిక్షణను కూడా ఇస్తుండడం గర్వకారణమన్నారు. 40 ఏళ్ల కిందట గద్వాలలో ఏర్పాటు చేసిన బాల భవన్ వేలాది మంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనతను పొందిందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులోనూ బాలభావన్ ను సద్వినియోగం చేసుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రదర్శనలతో జోగులాంబ గద్వాల జిల్లాకు పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

