భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల ఫోకస్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో తాత్కాలిక పనులకు స్వస్తి పలికి, ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్రానికే మోడల్‌గా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) అధికారులను ఆదేశించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, వివిధ శాఖల అధికారులతో ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

మురసు తుపాను (Cyclone Murasu) ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, రహదారులు, కల్వర్టులు, వంతెనలు, విద్యుత్‌ వ్యవస్థలను త్వరితగతిన పునరుద్ధరించాలని మంత్రి స్పష్టం చేశారు. ములకలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దెబ్బతిన్న రహదారులకు శాశ్వత పరిష్కారాలు చూపుతూ అవసరమైన చోట గేబియన్‌ నిర్మాణాలు చేపట్టాలన్నారు. భద్రాచలం–వెంకటాపురం రహదారి అభివృద్ధి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని, ఇసుక రవాణా వల్ల రోడ్లు దెబ్బతినకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ వీబీ-జి రామ్‌ జి పథకం కింద ప్రస్తుతం అందుబాటులో ఉన్న 375 రకాల పనులను సద్వినియోగం చేసుకొని శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి (Minister Tummala) తెలిపారు.

ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రానున్న జనవరి నుంచి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తాగునీరు, వ్యవసాయ రంగాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో గతంలో ఉన్న వ్యక్తిగత తాగునీటి పథకాలు, బోర్‌వెల్స్ , మోటార్లు, పంపింగ్‌ వ్యవస్థలను పరిశీలించి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మిషన్‌ భగీరథ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేలా పాత నీటి వనరులను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

నీటిని పొదుపుగా వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని, వరి, చెరకు వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆయిల్‌పామ్‌, ప్రత్యామ్నాయ మెట్ట పంటలు, పశుగ్రాస పంటల సాగును ప్రోత్సహించాలని కోరారు. పట్టణాభివృద్ధికి సంబంధించి కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, జూలూరుపాడు పట్టణాల్లో ప్రధాన రహదారుల మధ్య డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డిసిహెచ్ఓ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Also Read : మూడు రోజులు కొడంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం రేవంత్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>