కరీంనగర్‌లో ముస్లిం సంచార జాతుల దీక్షకు సీపీఎం మద్దతు

కలం, కరీంనగర్ బ్యూరో: ముస్లిం సంచార జాతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేస్తున్న శిబిరానికి సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం (Gudikandula Satyam) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక సంవత్సరాల నుంచి ముస్లిం సంచార జాతులు చదువుకు దూరమై, బ్రతుకు తెరువు నిమిత్తం వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని, వీరి ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని అన్నారు.

సంచార జాతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. 14 న్యాయమైన డిమాండ్లతో పోరాటం చేస్తున్న ముస్లిం సంచార జాతులకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ఎవరి మతాలను వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. అలాంటిది క్రిస్టియన్, ముస్లిం మతాలపై దాడులు చేస్తూ విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.

బ్రిటిష్ హయంలో జుట్టు, బట్ట పన్ను ఉండేదని.. బ్రిటిష్ పోయి బీజేపీ వచ్చిన జుట్టు పన్నుతో సహా తదితర నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. సంచార జాతుల వారు సైతం పన్నులు చెల్లిస్తున్నారని, వారి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు షేర్ అలీ, షబ్బీర్, షాదుల్, వసీం అహ్మద్, అజీమ్, శంషుద్దీన్, సయ్యద్ సిరాన్, షేక్ షబ్బీర్, అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>