అంకమ్మ చెరువుకు భారీ గండి.. రోడ్డుపై వరద బీభత్సం

కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి(Ootlapalli) సమీపంలోని అంకమ్మ చెరువుకు తుఫాన్  ప్రభావంతో భారీ గండి పడింది. రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు చెరువులోకి సామర్థ్యానికి మించి వరద నీరు చేరడంతో కట్ట తెగిపోయింది. దీంతో ఉప్పొంగిన వరద నీరు భద్రాచలం–రాజమండ్రి అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై భారీగా ప్రవహిస్తోంది. ఉట్లపల్లి సమీపంలో రహదారి కోతకు గురికావడంతో అధికారులు ఈ మార్గంలో ప్రయాణించే వందలాది వాహనాలను నిలిపివేశారు.

ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రహదారిపై ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో అశ్వారావుపేట వైపు వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు వరద ప్రవాహాన్ని లెక్కచేయకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అతడు నీటిలో పడిపోయాడు. దీనిని గమనించిన పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్రమత్తమయ్యారు. తాడు సహాయంతో అతడిని సురక్షితంగా బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. పోలీసుల సాహసం, సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.

మరోవైపు అంకమ్మ చెరువు కట్ట తెగడంతో దిగువన ఉన్న అశ్వారావుపేట, ఉట్లపల్లి, వేదాంతపురం, నల్లపాడు గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఊహించని విధంగా వరద పోటెత్తడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>