నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణపై కలెక్టర్ ఫోకస్

కలం, సారంగాపూర్: గ్రామీణ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో.. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం సారంగాపూర్ మండలం చించోలి (బి)(Chincholi) గ్రామ సమీపంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా భవన సదుపాయాలు, ఖాళీ స్థలాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు. కేంద్రం ఏర్పాటుకు కల్పించాల్సిన సదుపాయాలపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంపొందించి, వారికి స్వయం ఉపాధి మార్గాలను చూపడమే ఆర్‌ఎస్‌ఈటీఐ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యువత ఈ శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సొంతంగా ఉపాధి పొందేలా నాణ్యమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణకు వచ్చే వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, మహిళా శిశు వికాస కేంద్ర మేనేజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>