కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ (Nalgonda Corporation) అక్రమాలకు, ఇంటి దొంగలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. శానిటేషన్ కార్మికులకు వేతనాలు చెల్లింపు నుంచి ఫేక్ డెత్ సర్టిఫికెట్ల జారీ వరకు కార్పొరేషన్ లో రోజుకో అవినీతి బాగోతం వెలుగులోకి వస్తున్నది. అధికార యంత్రాంగం మాత్రం చూసీచూడనట్టు ఉంటుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్ ఉద్యోగుల పేర్లతో జీతాలు కాజేయడం, వాహనాల డీజిల్ పక్కదారి పట్టించడం, ట్రేడ్ లైసెన్సుల పేరుతో వసూళ్లకు పాల్పడటం వంటి అక్రమాలు కార్పొరేషన్లో నిత్యకృత్యంగా మారాయి. బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంలో కమిషనర్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఫేక్ సర్టిఫికెట్తో కారుణ్య నియామకం
కార్పొరేషన్ లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో భారీగా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లంచాలు ఇస్తే సిబ్బంది కోరిన తేదీలతో ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలకు.. రిటైర్డ్ అయి చనిపోయిన హెల్త్ అసిస్టెంట్ చామకూరి వెంకటేశ్వర్లు ఉదంతమే నిదర్శనం. ఆయన రిటైర్డ్ అయిన తర్వాతే మృతిచెందినా కానీ.. సర్వీస్‌లో ఉండగానే వెంకటేశ్వర్లు చనిపోయినట్టుగా ఫేక్ సర్టిఫికెట్ కార్పొరేషన్ సిబ్బంది జారీ చేశారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఫేక్ డెత్ సర్టిఫికెట్, నకిలీ ఆధార్ కార్డ్ ద్వారా మృతుడి కొడుకు రాజు వైద్య ఆరోగ్య శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా కారుణ్య నియామకం పొందాడు. ఇందుకు కార్పొరేషన్లో దాదాపు రూ.10 లక్షల వరకు డబ్బులు చేతులు మారినట్లు విశ్వసనీ య సమాచారం. గత కమిషనర్‌తో పాటు కొందరు సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
విచారణల పేరుతో కాలయాపన
ఫేక్ డెత్ సర్టిఫికెట్ జారీ వ్యవహారంపై ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ తీవ్రంగా స్పందించారు. మృతుడి భార్య వసంత, ఒక హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. దీంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ జనార్దన్, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ ఖాదీర్, కంప్యూటర్ ఆపరేటర్ మహ్మద్ సమీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణల పేరుతో కాలయాపన అవుతున్నది. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూసినా బాధ్యులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇది కూడా కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుందనే అనుమానాలు వస్తున్నాయి.
డిజిటల్ కీలతో ఇష్టానుసారంగా అప్రూవల్స్?
కార్పొరేషన్లో విచిత్రమైన విషయం ఏమిటంటే.. గతంలో పనిచేసి బదిలీపై వెళ్లిపోయిన కమిషనర్ల డిజిటల్ లాగిన్ కీలు ఇప్పటికీ సిబ్బంది వద్దే ఉన్నాయనే ప్రచారం ఉంది. ఆ పాత డిజిటల్ లాగిన్ కీలతోనే కమిషనర్లు మారిన సమయంలో అక్రమ అప్రూవల్స్ ఇచ్చారనే ఆరోపణలు సిబ్బంది పనితీరును ఎత్తి చూపుతున్నాయి. అన్ని లావాదేవీలను డిజిటలైజ్ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ తెరవెనుక లొసుగుల దందాలు అధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
డీజిల్ పక్కదారి.. ఫుడ్ బిల్లు గోల్మాల్..
కార్పొరేషన్లో ప్రతి పనిలో ఇంటి దొంగల ఆగడాలు ఆగడంలేదు. వాహనాల డీజిల్ ను సైతం డిజిటలైజ్ చేసేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రయత్నిస్తుంటే, ఓ కీలక ఉద్యోగి అడ్డుకుంటుండటం గమనార్హం. మున్సిపాలిటీకి కేటాయించిన డీజిల్‌ను సదరు ఉద్యోగి తన సొంత వాహనాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, గత ఎన్నికల సమయంలో నామినేషన్ల కోసం సిబ్బందికి ఏర్పాటు చేసిన ఫుడ్ బిల్లుల పేరుతో రూ.60 లక్షల నిధులు దుర్వినియోగమైనట్టు, ఆ స్కామ్ వెనుక కూడా అతనే ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ట్రేడ్ లైసెన్సుల జారీలోనూ పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది.
ఓ ప్రజాప్రతినిధి అండదండలు
కార్పొరేషన్ లో భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కీలక ఉద్యోగి జిల్లాలోని పెద్ద ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహిత అనుచరుడిగా చలామణి అవుతున్నాడు. రాజకీయ అండదండల కారణంగానే ఉన్నతాధికారులు సైతం ఆయనపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం ఆ ఉద్యోగి పేరు ప్రమోషన్ల జాబితాలో ఉండటంతో తాజా ఫేక్ డెత్ సర్టిఫికెట్ వ్యవహారాన్ని, ఇతర స్కామ్‌ల ఫైళ్లను ఎక్కడికక్కడ తొక్కిపెట్టేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ప్రజాధనం లూటీ అవుతున్నా.. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కొల్లగొడుతున్నా పట్టించుకోని ఇంటి దొంగల బాగోతంపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విచారణ జరిపితేనే అసలు నిజాలు వెలుగుచూసే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.

