కలం, ఖమ్మం బ్యూరో: భారీ వర్షాలు, వరద ఉధృతి కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బేతుపల్లి చెరువు (Bethupalli Tank)లో చిక్కుకున్న రక్షణ దళ సభ్యులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మరో వ్యక్తి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కంట్రీ బోట్‌పై వేటకు వెళ్లిన మత్స్యకారులు చిక్కుకుపోగా, వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లారు. మొత్తం 11 మంది బోటులో వెళ్లగా.. ప్రవాహం తీవ్రత ఎక్కువై బోటు బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదం సంభవించింది.
సమాచారం అందుకున్న వెంటనే NDRF, SDRF, ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక సివిలియన్లు రంగంలోకి దిగి రాత్రంతా సహాయక చర్యలు చేపట్టారు. 12 గంటలుగా కొనసాగుతున్న ఈ సహాయక చర్యల్లో 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి.. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరినీ సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం తన పూర్తి యంత్రాంగాన్ని రంగంలోకి దించిందని కలెక్టర్ టీఎస్ దివాకర స్పష్టం చేశారు.

