కలం, వెబ్ డెస్క్: నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె మీద గతంలో అనేక ఆరోపణలు, రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పూనమ్ కౌర్ ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను పంచుకున్నారు. తనను గతంలో ఎవరు వేధించారో.. తన మీద ఎలా తప్పుడు ప్రచారం చేశారో.. తనను రాజకీయంగా వాడుకోవాలని ఎలా చూశారో ఇటువంటి విషయాలు మొత్తం ఆమె బయటపెట్టారు. కొన్ని రాజకీయ పార్టీల నుంచి తనకు బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురయ్యాయని ఆమె ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను ఉపయోగించుకోవాలని కొందరు ప్రయత్నించారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని పూనమ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన న్యూడ్ వీడియోలు బయటపెడతామని కొందరు బెదిరించారని.. తనకు డబ్బు ఆఫర్ చేశారని ఆమె ఆరోపించారు.
కడప నుంచి బెదిరింపులు.. డబ్బు, పదవుల ఆఫర్లు
ఇంటర్వ్యూలో భాగంగా పూనమ్ (Poonam Kaur) కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఓ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలంటూ కడపకు చెందిన కొందరు వ్యక్తులు తనపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. ప్రెస్‌మీట్ పెట్టి చేసి ఆ నటుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయాలని వారు కోరినట్లు తెలిపారు. ఇందుకు తాను అంగీకరించకపోవడంతో, కావాల్సినంత డబ్బు ఇస్తామని, అంతేకాకుండా ఒక రాజకీయ పార్టీలో మంచి పొజిషన్ కూడా కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు పూనమ్ చెప్పారు. ఈ రెండు ఆఫర్లను తాను స్పష్టంగా తిరస్కరించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని పూనమ్ వెల్లడించారు. తన న్యూడ్ వీడియోలను విడుదల చేస్తామని బెదిరించారని, ఆ సమయంలో తాను తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెప్పారు. జరిగిన ఈ వ్యవహారాన్ని ఎవరితోనూ పంచుకోలేక, లోలోపలే దిగమింగుకుని మానసిక వేదన అనుభవించినట్లు పూనమ్ చెప్పారు.
పోసాని వ్యాఖ్యలతో తీవ్ర మానసిక గాయం
ఇక గతంలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన కొన్ని వ్యాఖ్యలు తనను తీవ్రంగా గాయపరిచాయని పూనమ్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో పోసాని చేసిన ‘పంజాబీ అమ్మాయి’ వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యల తర్వాత తన జీవితం నరకప్రాయంగా మారిందని చెప్పారు. “ఆ సమయంలో నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సంబంధాలు కూడా చూస్తున్నాం. కానీ, పోసాని పెట్టిన ప్రెస్‌మీట్, ఆ తర్వాత జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్ నా పెళ్లి కలను పూర్తిగా చిధ్రం చేశాయి. సంబంధం కుదిరే దశలో ఇలాంటి ఆరోపణలు రావడంతో నా వ్యక్తిగత జీవితం తీవ్రంగా దెబ్బతింది” అని పూనమ్ భావోద్వేగానికి లోనయ్యారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కారణాల వల్ల తాను ఎంతో నష్టపోయానని పూనమ్ చెప్పుకొచ్చారు.


