కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాను ప్రత్యేక కరువు జిల్లాగా (Special Drought District) ప్రకటించి, పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కళావేణ శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ ఎస్. విలాస్ నేతృత్వంలో ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి, లోకారి, వన్వట్, లింగుగూడ, మామిడిగూడ, కప్పర్ల, ధైయిగూడ తదితర గ్రామాల్లో కరువు యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా పత్తి చేలల్లో పంట పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడి నష్ట వివరాలను తెలుసుకున్నారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ.. అధికారులు జిల్లాలోని 20 మండలాలను కరువు మండలాలుగా గుర్తించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో గ్రామాల్లో పంట నష్టాలను అంచనా వేయాలని, పంటల బీమా, నష్టపరిహారం వెంటనే అందించాలని కోరారు.
పంట రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇవ్వడంతో పాటు తాగునీరు, పశుగ్రాసం, సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే వరకు సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు అరుణ్ కుమార్, గంగారెడ్డి, దేవేందర్, రామ్ రెడ్డి, కేశవ్, అజయ్, రవీందర్, జైతు, తుకారాం, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

