కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ పేస్ బౌలర్ నసీమ్ షాకు (Naseem Shah) ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఫైనల్‌లో అతడు రూల్స్‌ను బ్రేక్ చేశాడంటూ ఫైన్ విధించింది. మ్యాచ్ ఫీజులో 10శాతం ఫీజుగా చెల్లించాలని స్పష్టం చేసింది. డెజర్ట్ వైపర్స్ తరఫున ఆడిన నసీమ్ షా, MI ఎమిరేట్స్‌తో జరిగిన తుది పోరులో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్టు మ్యాచ్ రిఫరీ సైమన్ టౌఫెల్ నిర్ధారించారు. బ్యాటర్ ఔట్ అయిన తర్వాత రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదనే నిబంధనను అతడు పట్టించుకోలేదని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటన 11వ ఓవర్లో చోటు చేసుకుంది. నసీమ్ (Naseem Shah) వేసిన బంతిని కైరన్ పోలార్డ్ డిఫెన్స్ చేసిన వెంటనే అతడిని చూసి నవ్వాడు. పోలార్డ్ ఆగ్రహంగా స్పందించడంతో మాటల తూటాలు మారాయి. పరిస్థితి వేడెక్కుతుండటంతో అంపైర్లు మధ్యలోకి వచ్చి వివాదాన్ని ఆపేశారు. అయితే మ్యాచ్ మలుపు తిప్పిన క్షణం 16వ ఓవర్ తొలి బంతికే వచ్చింది. అదే ఓవర్‌లో పోలార్డ్‌ను ఔట్ చేసి నసీమ్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. అప్పటికే పోలార్డ్ 28 పరుగులతో ప్రమాదకరంగా కనిపించాడు.
ఇదిలా ఉంటే ఫైనల్‌లో డెజర్ట్ వైపర్స్ పూర్తి ఆధిపత్యం చూపించింది. MI ఎమిరేట్స్‌ను 18.3 ఓవర్లలో 136 పరుగులకే కట్టడి చేసి, క్లబ్ చరిత్రలో తొలి ILT20 టైటిల్‌ను అందుకుంది. బౌలింగ్‌లో నసీమ్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వైపర్స్‌కు కెప్టెన్ టామ్ కరన్ బలంగా నిలిచాడు. 51 బంతుల్లో 74 పరుగులతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడి పోరాటంతో జట్టు 20 ఓవర్లలో 182 పరుగులు సాధించింది. చివరకు అదే స్కోర్ టైటిల్ కలగా మారింది.


