కలం, వరంగల్ బ్యూరో: అప్పు డబ్బులు ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరిన తల్లి కొడుకును ఓ హెడ్ కానిస్టేబుల్ చితకబాదాడు. ఈ ఘటన హనుమకొండ (Hanamkonda) జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ గోకుల్ నగర్లో నివాసముంటున్న గోక శ్రావణ్ కుమార్ తన తల్లి అయిన గోక అరుణ అదే కాలానికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి వద్ద మూడు సంవత్సరాల క్రితం రూ. 3,20,000 అప్పు తీసుకుంది. 7 నెలల క్రితం వరకు 4.5శాతం ఇంట్రెస్ట్ తో ప్రతి నెల రూ.14వేల 400 రూపాయలు చెల్లించుకుంటూ వచ్చారు.
ఇటీవల ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆరు నెలలు సమయం కావాలని కుమారుడు యాదగిరిని అడిగారు. సమయం ఇచ్చేది లేదంటూ అగ్రహించిన యాదగిరి సోమవారం ఇంటి గేటుకి తాళం వేశాడు. శ్రావణ్ తాళం పగులకొట్టి ఇంట్లోకి వెళ్లాడు. దీంతో కానిస్టేబుల్ (AR Constable), తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తల్లి, కుమారుడిపై దాడి చేశాడు. వారం రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని భయభ్రాంతులకు గురి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


