కలం, నిర్మల్ : ఎల్నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు.. పడిపోయిన భూగర్భ జలాలు.. నీరు లేక ఎండుతున్న పంటలు.. పెట్టుబడులు చేతికందక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రైతులు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు నెలకొన్న ప్రభుత్వం కరువు మండలాల (Drought Mandals) ప్రకటన సగం మండలాలకి పరిమితం చేయడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో కరువు ప్రభావిత మండలాలను ప్రభుత్వం గుర్తించినప్పటికీ, తమ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయని, వాటిని కూడా కరువు జాబితాలో చేర్చాలని పలువురు రైతులు కోరుతున్నారు. మండలాల ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఈ అంశం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
72 మండలాల్లో 45 మండలాలకు కరువు హోదా..
2026 వానాకాలం పంటల సాగు పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24న జారీ చేసిన జీవో నంబర్ 3 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 111 మండలాలు తీవ్ర కరువు, 254 మండలాలు మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాలకు చెందిన మొత్తం 72 మండలాల్లో 45 మండలాలను గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 20, నిర్మల్ జిల్లాలో 9, మంచిర్యాల జిల్లాలో 11, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 5 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అయితే ఒక మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడానికి కేవలం వర్షపాతాన్నే కాకుండా పంటల సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భ జలాలు, ఉపగ్రహ ఆధారిత పంట పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిశీలన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నాలుగు జిల్లాల్లో పరిస్థితి ఇలా..
ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో మొత్తం 20 మండలాలు కరువు ప్రభావిత జాబితాలో ఉన్నాయి. భీంపూర్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ అర్బన్, సిరికొండ మండలాలను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా, మరో 16 మండలాలను మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.
నిర్మల్ జిల్లా: జిల్లాలో 9 మండలాలకు కరువు హోదా లభించింది. ఖానాపూర్ మండలాన్ని తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతంగా, కుబీర్, భైంసా, కుంటాల, నిర్మల్ అర్బన్, సోన్, లక్ష్మణచందా, కడెంపెద్దూర్, దస్తురాబాద్ మండలాలను మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.
మంచిర్యాల జిల్లా: మొత్తం 11 మండలాలను మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. జన్నారం, దండేపల్లి, హాజీపూర్, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల, నస్పూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జైనూర్, సిర్పూర్ (యు), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాలను మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.
వర్షాలు లేక.. నీటి వనరులు అడుగంటడంతో ఆందోళన..
వానాకాలం ప్రారంభంలో కొంతమేర వర్షాలు కురిసినా, ఆ తర్వాత చాలాచోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గడం, బోరుబావుల్లో నీటి మట్టాలు పడిపోవడం, పంటలకు కీలక దశలో నీరు అందకపోవడం వంటి సమస్యలు సాగుపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. ప్రత్యేకించి వరి, పత్తి వంటి పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో దిగుబడులు తగ్గితే అప్పులు ఎలా తీర్చాలని ప్రశ్నిస్తున్నారు. పంటలు పూర్తిస్థాయిలో చేతికందకపోతే కుటుంబ పోషణ కూడా భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగిలిన మండలాల రైతుల అభ్యంతరాలు..
కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన మండలాల్లో రైతులకు ప్రభుత్వ సహాయక చర్యలు అందే అవకాశం ఉండటంతో.. జాబితాలో చోటు దక్కని ప్రాంతాల రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ మండలాల్లోనూ వర్షాభావం, నీటి కొరత, పంటల నష్టాలు ఉన్నప్పుడు కరువు జాబితాలో ఎందుకు చేర్చలేదని వారు ప్రశ్నిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో సారంగాపూర్, లోకేశ్వరం, ముధోల్, నర్సాపూర్ (జి), మామడ, నిర్మల్ రూరల్ తదితర ప్రాంతాల రైతులు తమ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఖానాపూర్ మండలానికి తీవ్ర కరువు హోదా లభించగా, ఇతర ప్రాంతాల్లోనూ నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత మేరకు అదనపు మండలాలను చేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కరువు సాయం అందేనా?
కరువు మండలాల ప్రకటనతో వ్యవసాయ పెట్టుబడి సాయం, తాగునీటి సరఫరా మెరుగుదల, పశుగ్రాసం అందుబాటు, అవసరమైన చోట పశువుల శిబిరాల ఏర్పాటు, గ్రామీణ ఉపాధి అవకాశాల పెంపు వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణకు బ్యాంకులతో చర్చించాలని, రైతులపై బలవంతపు రుణ వసూళ్లు జరగకుండా చూడాలని సూచించింది. అయితే కరువు హోదా ప్రకటించినంత మాత్రాన రైతుల ఖాతాల్లో పరిహారం వెంటనే జమ అయినట్లు కాదు. వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడానికి కేంద్రం నుంచి జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) సాయం అందిన తర్వాత నెలలోపు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిహారం ఎప్పుడు అందుతుంది? పంట నష్టాన్ని ఎలా లెక్కిస్తారు? అర్హులైన రైతుల జాబితాను ఎప్పుడు ప్రకటిస్తారు? అన్న ప్రశ్నలు రైతుల్లో నెలకొన్నాయి.
పోరాటానికి రాజకీయ పార్టీలు సిద్ధం!
కరువు మండలాల ఎంపికపై రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని తమ పోరాటానికి ప్రాతిపదికగా తీసుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. కరువు తీవ్రతను మండలాల సరిహద్దులతో కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా పరిశీలించాలని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల రైతులు తమ మండలాలను కూడా కరువు ప్రభావిత జాబితాలో చేర్చాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. మరిన్ని ప్రాంతాల నుంచి ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం, పంటల పరిస్థితి, భూగర్భ జలాల స్థాయి, సాగునీటి లభ్యతపై సమగ్ర పరిశీలన చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, వాస్తవంగా నష్టపోయిన ప్రతి రైతుకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎకరాకు రూ.15 వేల పరిహారం అందించాలి: మహేశ్వర్ రెడ్డి
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంపై ఆరు నెలల ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ, రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో స్పష్టంగా వెల్లడించడం లేదన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితుల్లో రైతుల కోసం రూ.7 వేల కోట్లు విడుదల చేయగా, గుజరాత్ ప్రభుత్వం హెక్టారుకు రూ.8,500 చొప్పున సాయం అందిస్తోందని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం పంటలు వేయవద్దని సూచించడం తప్ప, రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని ఏలేటి విమర్శించారు. వర్షాభావంతో పెట్టుబడులు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితుల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేసి, ఎల్నినో ప్రభావంతో నష్టపోయే రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి: అనిల్ జాదవ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో అధిక శాతం మంది గిరిజన, ఇతర రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తారు. ఈసారి సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయి, పెట్టుబడులు చేతికి అందక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 45 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదు. క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి, నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాపై ప్రేమ ఉందని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి, కరువు ప్రకటన విషయంలోనూ అదే చిత్తశుద్ధిని చూపించాలన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంతో పాటు రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతావని అనిల్ జాదవ్ హెచ్చరించారు.

