ప్రవళిక కుటుంబానికి రూ. 1.10 కోట్ల పరిహారం.. మంత్రి పొన్నం ప్రకటన!

​కలం, ఖమ్మం బ్యూరో: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి చెందడం అత్యంత బాధాకరమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున పూర్తి భరోసా కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద కండక్టర్ ప్రవళిక (Conductor Pravallika) పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రవళిక తల్లిని పరామర్శించి, ఆర్టీసీ కుటుంబం తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

​ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ.. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయడంతో పాటు, ఆర్టీసీ తీసుకున్న ప్రత్యేక నిర్ణయం ద్వారా బ్యాంక్ నుంచి రూ. కోటి ప్రమాద బీమా పరిహారం ఆ కుటుంబానికి అందనుందని వెల్లడించారు. ఆర్థికంగా ఎంత సాయం చేసినా కుటుంబ సభ్యురాలను కోల్పోయిన బాధను తీర్చలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదం జరగగానే ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి చర్యలు తీసుకున్నప్పటికీ, దురదృష్టవశాత్తూ ప్రవళికను కాపాడుకోలేకపోయినట్లు తెలిపారు. ప్రయాణికులు మనకు దేవుళ్లతో సమానమని, సిబ్బంది భద్రతతో పాటు ప్రయాణికుల సౌకర్యాలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప, ఎవరూ నేరుగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల ఒక నిండు కుటుంబం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నిందితురాలిపై మొదట నమోదైన కేసును హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్చి, తగిన విధంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని, కార్మికులలో ఎలాంటి అసహనం లేకుండా పెండింగ్ సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఆర్టీసీని ఎప్పుడూ క్రమశిక్షణ గల సంస్థగా ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలని, ప్రయాణికులను దేవుళ్లుగా భావించి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, సిబ్బందికి ఏ ఇబ్బంది ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు ఆర్టీసీ సిబ్బంది పాల్గొని ప్రవళిక మృతికి సంతాపం తెలిపారు.

Also Read : పార్కు భూమికి ఫార్మా కంపెనీ ఎసరు.. రూ.7 కోట్ల స్థలం కబ్జా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>