మద్యం కుంభకోణం కేసు..ఈడీ విచారణకు హాజరైన అంబటి రాంబాబు

కలం, వెబ్‌ డెస్క్‌ : వైసీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు (ED Inquiry) హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆయన నుంచి అధికారులు మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లు సమాచారం.

గతంలోనే విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇటీవల తనకు గుండెకు స్టెంట్లు వేయించుకున్నానని, ఆరోగ్య సమస్యల కారణంగా విచారణకు రాలేనని వైద్య నివేదికలతో సహా ఈడీకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 4న తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని అధికారులు మరోసారి నోటీసులు పంపారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. కొందరికి ప్రయోజనం చేకూర్చేలా టెండర్ నిబంధనలను మార్చారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులు, రాజకీయ నేతలను ఈడీ అరెస్ట్ చేసింది. వారిలో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఉన్నారు. గతంలో స్పందించిన అంబటి రాంబాబు తాను ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని వెల్లడించారు. తాజా విచారణలో అధికారులు అడిగే ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>