కలం, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి (Adilabad RIMS Hospital)లో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఆసుపత్రిలోని అత్యవసర విభాగాల నుంచి ఏకంగా నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత నెల 30వ తేదీన ఆసుపత్రి రెండో అంతస్తులోని ఆర్‌ఐసీయూ, చెస్ట్ వార్డు నుంచి రెండు, టీబీ వార్డు నుంచి మరో రెండు చొప్పున మొత్తం నాలుగు వెంటిలేటర్లు అపహరణకు గురయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ఈ వెంటిలేటర్లను చాకచక్యంగా బయటకు తరలిస్తున్న దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించినట్లు సమాచారం.
రిమ్స్(Adilabad RIMS)లో ఇలాంటి దొంగతనాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు రోగుల సహాయకుల సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురైన ఘటనలు ఉన్నాయి. ఈ తాజా ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఆ సమయంలో విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్లు, భద్రతా సిబ్బందితో సహా మొత్తం 10 మందికి మెమోలు జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read : ‘కాన్వా’లో లే ఆఫ్స్.. 1,271 మందిపై వేటు!
Follow Us On : WhatsApp

