నిజామాబాద్ జిల్లాలో ‘ఇందిరమ్మ ఇండ్ల’ పంచాయితీ

కలం, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్‌ పార్టీ (Nizamabad Congress) కి కొత్త తలనొప్పిగా మారుతున్నది. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న ప్రభుత్వ సంకల్పం.. సొంత పార్టీ నేతల రాజకీయ ఒత్తిళ్లకు వేదికగా మారుతున్నదనే చర్చ సాగుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో తమ నియోజకవర్గాలకు, తమ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నేతల నుంచి వస్తున్న విజ్ఞప్తులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం.

ఒకవైపు పార్టీ నేతలను సమన్వయం చేయడం.. మరోవైపు అర్హులైన పేదలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ బాధ్యత.. ఈ రెండింటి మధ్య సీతక్కకు సవాల్‌ ఎదురవుతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్‌ నేతల మధ్య ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది.

బాన్సువాడలో కాంగ్రెస్ విభేదాలు

ఇందిరమ్మ ఇండ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా బాన్సువాడ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరయ్యాయి. అయితే ఈ ఇండ్ల పంచాయితీ స్థానిక నాయకుల మధ్య విభేదాలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. మొత్తం ఇండ్ల కోటా తనకే దక్కాలని పట్టుబట్టడం చర్చకు దారితీసింది. తొలుత మెజారిటీ ఇండ్లను ఎమ్మెల్యే పోచారం వర్గానికి కేటాయించి, కొన్నింటిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన రవీందర్‌రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్‌లకు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి పోచారం నిరాకరించడంతో వివాదం సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు చేరింది. దీంతో సంయమనం పాటించాలని ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు సీఎం సూచించారు. ఎంపీ షెట్కార్ మంత్రి సీతక్క వద్ద తన ఆవేదన వ్యక్తం చేయడం ఆధిపత్య పోరును స్పష్టం చేస్తున్నది.

నేతల నుంచి రిక్వెస్టుల వెల్లువ!

ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల జీవితాల్లో కీలక మార్పు తీసుకొచ్చే సంక్షేమ కార్యక్రమం. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే, పథకం అమలులో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. నియోజకవర్గాల వారీగా కేటాయింపులు పెంచాలని, తమ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమకు అనుకూలంగా లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి, వాటిని పరిశీలించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. మరికొందరు తమ నియోజకవర్గాలకు కేటాయింపులు పెంచాలని పట్టుబడుతున్నారు. దీంతో నేతలందరినీ సమన్వయం చేయడం మంత్రి సీతక్కకు ఇబ్బందికరంగా మారింది.

కన్విన్స్‌ చేయడమే పెద్ద సవాల్‌!

నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పార్టీ నేతల (Nizamabad Congress) మధ్య సమన్వయం చేయడం సీతక్కకు అత్యంత కీలకంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరి అభ్యర్థనకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరిని ఎలా ఒప్పించాలి? అనేది ప్రధాన ప్రశ్నగా నిలిచింది. ఒక నేత అభ్యర్థనను అంగీకరిస్తే మరో నేత నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రయత్నం కేటాయింపుల విషయంలో ఎంతవరకు సాధ్యమవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం దృష్టికి నేతల భిన్నాభిప్రాయాలు!

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల విషయంలో నేతల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణయం కీలకంగా మారనున్నది. ఇండ్ల కేటాయింపుల్లో ఎవరి సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న దానికంటే.. అర్హతల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడమే ప్రభుత్వానికి ప్రధానమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

బీజేపీకి అస్త్రం కాకూడదనే ఆందోళన!

ఇందిరమ్మ ఇండ్ల పథకం విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారనున్నది. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి వంటి బీజేపీ నేతలు బలంగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇండ్ల కేటాయింపుల్లో జాప్యం జరిగినా, అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చినా వాటిని ప్రతిపక్షం రాజకీయ అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన కనిపిస్తున్నది. ముఖ్యంగా సొంత పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సొంత నేతలను సంతృప్తిపరచడంతో పాటు అర్హులైన పేదలకు న్యాయం చేయడం కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్‌గా మారింది.

పథకం పురోగతిపై ప్రభావం పడుతుందా?

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో రాజకీయ ఒత్తిళ్లు పెరిగితే లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణాల పురోగతిపై ప్రభావం పడుతుందనే చర్చ సాగుతున్నది. నేతల అభిప్రాయ భేదాల వల్ల అధికార యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమవుతాయి. ఇండ్ల కేటాయింపుల్లో పారదర్శకత, వేగవంతమైన నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పరిశీలకులు సూచిస్తున్నారు. పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>